చంద్రబాబుకు బిగ్ షాక్.. సీఐడీ కస్టడీకి కోర్ట్ అనుమతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయనను రెండ్రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే న్యాయమూర్తి రెండ్రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించారు. అంతేకాదు.. టీడీపీ అధినేతను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని ఆదేశించారు.
జైల్లోనే చంద్రబాబు విచారణ :
ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లకు అనుమతించింది. చంద్రబాబును విచారించే అధికారుల పేర్లు కోర్టు సమర్పించాలని, విచారణ వీడియోలు బయటకు రాకుండా చూడాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు. ఆదివారం కస్టడీ ముగిసిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపరచాలని సూచించారు. దీనిపై స్పందించిన సీఐడీ అధికారులు .. చంద్రబాబును జైల్లోనే విచారిస్తామని కోర్టుకు తెలిపింది.
విచారణ కీలక దశలో జోక్యం చేసుకోలేం :
ఇక 68 పేజీల క్వాష్ ఆర్డర్ కాపీలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపమనడం సరికాదని.. క్వాష్ పిటిషన్లను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటామని పేర్కొంది. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలని, సీఆర్పీసీ 482 కింద దాఖలైన పిటిషన్పై మినీ ట్రయల్ నిర్వహించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. 2021 నుంచి 140 మందిని ఈ కేసులో సీఐడీ విచారించిందని, 4000 డాక్యుమెంట్లు సేకరించిందని, ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments