స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. వాట్ నెక్ట్స్!?
- IndiaGlitz, [Thursday,January 21 2021]
ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఎన్నికలు.. జరుగుతాయా? లేదా? జరపాలని ఒకరు పట్టుబడితే.. ఎలాగైనా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగిసే వరకూ అడ్డుకోవాలని మరొకరు. ఎన్నికలకు ముందే ఓ యుద్ధమైతే జరిగింది. ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్ మధ్య జరిగిన ఈ యుద్ధానికి గురువారం హైకోర్టు ఒక ముగింపు పలికింది. ఇది తుది ముగింపా.. లేదంటే సుప్రీంకోర్టులో మరో ముగింపు ఉంటుందా? అనే అంశాన్ని పక్కనబెడితే ప్రస్తుతానికి ఒక క్లారిటీ వచ్చింది. మొత్తానికి ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు మద్దతుగా నిలిచింది.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది.
కాగా.. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపిందన్నారు. త్వరలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్టు నిమ్మగడ్డ తెలిపారు. కాగా.. పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 23న నోటిఫికేషన్ వెలువడనుంది. ఎస్ఈసీ నిర్ణయించిన తేదీలో ఉదయం 6:30 నుంచి 3:30 వరకూ పోలింగ్ జరగనుండగా.. అదే రోజు 4 గంటల నుంచి లెక్కింపు జరగనుంది.