ఆనందయ్యను ఎందుకు ఇంతలా వేధిస్తున్నారు?
- IndiaGlitz, [Monday,May 31 2021]
ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టు ప్రశ్నించింది. 4 రోజులు సమయం ఇచ్చినా.. ఉత్తర్వులను ఎందుకు కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 నిమిషాల్లో ప్రభుత్వ ఉత్తర్వులను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. 15 నిమిషాల తర్వాత విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే విచారణను హైకోర్టు 15 నిమిషాల పాటు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ఆనందయ్య మందుతో కోలుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ మృతి
కాగా.. పోలీసు నిర్భంధంలో ఉన్న ఆనందయ్యపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. 10 రోజులుగా పోలీస్ నిర్బంధంలోనే ఆనందయ్య ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆనందయ్య సైతం తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ అవసరం లేదన్నా కూడా ఆనందయ్యను పోలీసులు బలవంతంగా తరలించారు. గుంటూరు ఐజీతో మాట్లాడినా.. స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలని హుకుం జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఆనందయ్యను నిర్బంధంలో ఉంచాల్సిన పరిస్థితి ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. అసలు ఎందుకు ఆయనను ఇంతలా వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆనందయ్య మందుపై ఆయుష్ కమిషనర్ వివరణ..
ఆనందయ్య తయారు చేసే మందు కొవిడ్ కోసం ఉపయోగిస్తానన్న దరఖాస్తు ఎక్కడా లేదని, సుమోటుగా ఈ మందు కోవిడ్‌కు పనికొస్తుందా? లేదా? అన్నది పరిశోధన చేసే అవకాశం ఇప్పట్లో లేదని ఆయూష్ కమిషనర్ వి. రాములు స్పష్టం చేశారు. నిజానికి ఆనందయ్య కూడా ఈ మందు కొవిడ్ కోసం కనిపెట్టానని ఎక్కడ చెప్పలేదన్నారు. అయితే గత 30 ఏళ్లుగా ఈ మందును వివిధ సమస్యల కోసం ఆనందయ్య అందిస్తున్నారని.. అదే మందు కొవిడ్ పేషెంట్స్‌కు కూడా ఉపకరిస్తోందన్నారు. దీనిని కొవిడ్ మందుగా గుర్తించమని.. ఒకవేళ ఆనందయ్య దరఖాస్తు పెట్టుకుంటే అప్పుడు విచారించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయూష్ కమిషనర్ రాములు అన్నారు.