వైసీపీ సర్కారుకు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ
- IndiaGlitz, [Tuesday,August 18 2020]
వైసీపీ సర్కారుకు కోర్టులో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు కోర్టులు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నాయి. దీంతో వైసీపీ సర్కారు ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
విశాఖలోని తిరుమల గిరిజన పాఠశాల స్థలాన్ని ఇళ్ల పట్టాలుగా మార్చి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు ప్రభుత్వ బడులు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.
కాగా.. ఏపీలో ఆగస్టు 15న ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. దీనిపై కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇళ్ల పట్టాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతుండటంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.