సినిమా టికెట్ల వ్యవహారం.. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు, జాయింట్ కలెక్టర్లదే నిర్ణయం
- IndiaGlitz, [Thursday,December 16 2021]
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు తగ్గింపుపై గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ని హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదలను జాయింట్ కలెక్టర్‌లకు సమర్పించాలని.. వీటిని పరిశీలించి జేసీలే నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు తెలిపింది. అలాగే ఈ వ్యవహారంపై కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే.. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35ను సవాల్ చేస్తూ థియేటర్ల యజమాన్యాలు గతంలో హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి న్యాయమూర్తి.. ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. జీవో 35కు ముందు విధానంలోనే టికెట్ ధరలను నిర్ణయించుకునేందుకు పిటిషన్‌దారులకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
అయితే సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. థియేటర్ యాజమాన్యాలు ఎక్కువ ధరలకు టికెట్ ధరలను నిర్ణయించుకుంటే సామాన్యుడిపై భారం పడుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న హైకోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.