Nara Lokesh:ఇన్నర్ రింగ్ రోడ్ కేసు : లోకేష్‌కు షాక్ .. బెయిల్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్ట్, నోటీసులిచ్చేందుకు సీఐడీ రెడీ
Send us your feedback to audioarticles@vaarta.com
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం డిస్పోస్ చేసింది. అంతేకాదు.. ఈ కేసులో లోకేష్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని ధర్మాసనం ఆదేశించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని లోకేష్‌కు తేల్చి చెప్పింది. లోకేష్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. సీఐడీ వాదనలను పరిగణనలోనికి తీసుకున్న ధర్మాసనం లోకేష్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారులు కాసేపట్లో ఢిల్లీకి వెళ్లి లోకేష్‌కు నోటీసులు ఇచ్చే అవకాశాలు వున్నాయి.
కాగా.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్‌ను ఏ 14గా చేర్చించింది సీఐడీ. ఈ మేరకు విజయవాడ కోర్టులో మెమో కూడా దాఖలు చేసింది. దీంతో లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లోనూ లోకేష్ మరో రెండు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని అత్యవసరంగా విచారించాలని ఆయన కోర్టును కోరారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ రెండు పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం వుంది.
ఇకపోతే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. జాతీయ మీడియాకు ఏపీలోని పరిస్ధితులు తెలియజేయడంతో పాటు జాతీయ నేతలను కూడా కలవాలని లోకేష్ భావించారు. న్యాయ నిపుణులతోనూ ఆయన చర్చలు జరిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అరెస్ట్ భయంతోనే లోకేష్ ఢిల్లీ వదిలి రావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments