Chandrababu Naidu:స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు .. క్వాష్ పిటిషన్ కొట్టివేత
- IndiaGlitz, [Friday,September 22 2023]
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్ట్ జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నెల 19న ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. చంద్రబాబు పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. కేసు చెల్లదన్న చంద్రబాబు తరపున న్యాయవాదుల వాదనను హైకోర్టు తిరస్కరించింది. 17ఏ సెక్షన్ కింద అరెస్ట్ చెల్లదన్న వాదనను కూడా న్యాయస్దానం అంగీకరించలేదు. చంద్రబాబు అరెస్ట్ సక్రమమేనని, కేసు దర్యాప్తు జరగాల్సిందేనన్న సీఐడీ వాదనలతో కోర్టుఏకీభవించింది.
చంద్రబాబు రిమాండ్ పొడిగింపు :
మరోవైపు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడుకు మరోషాక్ తగిలింది. ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం ఏసీబీ కోర్ట్ వెల్లడించింది. 14 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా తనను జైలులో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని.. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని చంద్రబాబు న్యాయమూర్తిని కోరారు.
అన్యాయంగా అరెస్ట్ చేశారు : చంద్రబాబు
తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితమని.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసేంది తానేనని, అన్యాయంగా తనను అరెస్ట్ చేశారని ఇదే తన బాధ, ఆవేదన, ఆక్రందన అన్నారు. ఈ వయసులో తనకు పెద్ద శిక్ష ఇచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. తనపై వున్నవి ఆరోపణలు మాత్రమేనని.. నిర్ధారణ కాలేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తాను చట్టాన్ని గౌరవిస్తానని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని.. ఇదే నా బాధ, ఆవేదన , ఆక్రందన అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.