అంగన్‌వాడీ వర్కర్లకు ప్రభుత్వం వార్నింగ్.. సమ్మె విరమించకపోతే..?

  • IndiaGlitz, [Tuesday,January 02 2024]

ఏపీలో కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్ల(Anganwadi Workers)కు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరుకావాలని..లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అంగన్ వాడీ వర్కర్ల సమ్మెతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని.. ప్రధానంగా గర్భిణులు, శిశువులు పౌష్టికాహారం అందక ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ప్రభుత్వం నోటీసులపై అంగన్ వాడీ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా వేతనాల పెంపు, గ్రాట్యుటీ సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలని గత 22 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన ఆపేది లేదని ప్రభుత్వానికి ఇప్పటికే తేల్చి చెప్పారు. పలు మార్లు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు చర్చించారు. అయితే వేతనాల పెంపుపై కొంత సమయం ఆగాలన్న సూచనలు అంగన్ వాడీ సంఘాల నేతలు అంగీకరించలేదు. దీంతో చర్చలు విఫలం కావడంతో నిరసన కొనసాగిస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ తమ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలని లేకపోతే మూడు నెలల్లో తాము నొక్కే బటన్‌తో వైసీపీ గద్దె దిగుతుందని కార్యకర్తలు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది కార్యకర్తలు సమ్మె చేస్తుంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం మీరు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేస్తే ఇంత అన్యాయం చేస్తారా? అని నిలదీస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.