ఏపీలో ఆన్‌లైన్ టికెట్ల విక్రయానికి ఏర్పాట్లు.. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి, రేసులో ‘అల్లు’ సంస్థ
- IndiaGlitz, [Tuesday,March 29 2022]
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. త్వరలోనే ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు విక్రయించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం టెండర్లు పూర్తి చేసింది.. ఈ టెండర్లలో జస్ట్ టికెట్ సంస్థ L -1 గా నిలిచినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ప్రైవేట్ సంస్థల కంటే తక్కువగా ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.. ప్రేక్షకులపై ఆన్‌లైన్ చార్జీల భారం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
జస్ట్ టికెట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేశ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనితో పాటు, బుక్‌మై షోతో కలిసి మిడిల్ ఈస్ట్ ఏషియాలో వ్యాపారం నిర్వహిస్తున్న మరో సంస్థ బిడ్ దాఖలు చేసినట్టు సమాచారం. ఒక్కో టికెట్‌పై ప్రభుత్వానికి 90 పైసలు చెల్లించేందుకు ఓ సంస్థ, 75 పైసల చొప్పున చెల్లించేందుకు మరో సంస్థ కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే టెండర్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం.
ప్రభుత్వ నిర్ణయంతో టికెట్ రేట్ల నియంత్రణతో పాటు క్యూలలో ప్రేక్షకులు గంటలు గంటలు నిలబడాల్సిన పరిస్థితికి, బ్లాక్ టికెట్ల మాఫియాకు చెక్ పడనుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టికెట్ల విక్రయం చేపట్టాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దీనిని బట్టి ఇకపై ఎఫ్‌డీసీ పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్ టికెట్లు కొనుగోలు చేయాలి.