జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు వెనక్కి

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిమిత్తం ఉద్దేశించిన మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని.. దీనిపై అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. అంతకుముందే మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయని, అందుకే 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో జగన్ అసెంబ్లీలో చేయబోయే ప్రకటనపై రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రాజధాని ప్రాంతవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిల్లులోని లోపాలను సరిచేసి మళ్లీ కొత్తగా ప్రవేశపెడతారని కొందరు అంటుంటే.. లేదు అమరావతినే ఏకైక రాజధానిగా జగన్ కొనసాగించనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి జగన్ మనసులో ఏముందనేది మరికొద్దిసేపట్లోనే తేలిపోనుంది.