సినిమా టికెట్లపై తగ్గేదే లే.. కొత్త జీవో తెచ్చిన జగన్ సర్కార్, ఏపీఎఫ్‌డీసీకి ‘‘ఆన్‌లైన్’’ బాధ్యతలు
- IndiaGlitz, [Sunday,December 19 2021]
సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వ్యవహారం ఇంకా కోర్టులో వుండగానే ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా ఆదివారం జీవో నెం. 142 ను జారీ చేసింది. దీని ప్రకారం టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ నియంత్రలోనే జరుగుతాయి. ఈ బాధ్యతను ఏపీఎఫ్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)కి అప్పగించింది. ఐఆర్‌సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అతి త్వరలోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇకపై ప్రైవేటు ప్లాట్‌ఫామ్‌లపై టికెట్ బుక్ చేసుకునే అవకాశం, థియేటర్లలో టికెట్ కొనుక్కునే సదుపాయం ఉండదని సమాచారం.
మరోవైపు సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు. సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని వాదించారు. పిటిషనర్ తరపు వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం... ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.35ను న్యాయస్థానం సస్పెండ్ చేసింది.
అయితే, కేవలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని మిగిలిన అన్ని థియేటర్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని రాష్ట్ర హోంశాఖ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే జీవో నెం.142ను తీసుకురావటం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.