AP Govt:ఏపీలో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కార్డులకు చరమగీతం.. ఇప్పుడెలా..?
- IndiaGlitz, [Saturday,August 19 2023]
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్‌సీలను కార్డ్ రూపంలో జారీ చేయమని తెలిపింది. సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లే దీనికి సరిపోతాయని రవాణా శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులకు ఇప్పటి వరకు కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్‌కు రూ.25 వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛార్జీలను కూడా వసూలు చేయడం లేదని తెలిపారు. ఇప్పటికే డబ్బులు చెల్లించిన వాహనదారులకు త్వరలో కార్డులను అందజేయనున్నార. కేంద్ర రవాణా శాఖ‘వాహన్ పరివార్’తో సేవలన్నీ ఆన్‌లైన్ చేయడంతో దేశంలోని పలు రాష్ట్రాలు కార్డులను తొలగించింది, డిజిటల్ రూపంలోనే పత్రాలు తీసుకొచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిని అమల్లోకి తీసుకువచ్చింది.
ధ్రువపత్రాలు ఎలా పొందాలంటే:
రవాణా శాఖ వైబ్‌సైట్ హెచ్‌టీటీపీఎస్/ ఏపీఆర్‌టీఏసీటిజన్.ఈప్రగతి.ఓఆర్జీలో ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకుని ధ్రువపత్రాన్ని పొందాలి.
ఏపీఆర్‌టీఏసీటిజన్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు వాహనాల్ని తనిఖీలు చేసే సమయంలో పోలీసులు, రవాణా శాఖ అధికారులకు డౌన్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లను చూపిస్తే చాలు. వీటి అనుమతిపై ఇప్పటికే పోలీసులు, రవాణా శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.