గౌతంరెడ్డి జ్ఞాపకార్ధం రూ.225 కోట్ల విరాళం.. అలా చేయాలని జగన్‌ని కోరిన మేకపాటి ఫ్యామిలీ
- IndiaGlitz, [Friday,February 25 2022]
ఇటీవల గుండెపోటుతో మరణించిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జ్ఞాపకార్థం ఆయన పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు గౌతంరెడ్డి కుటుంబీకుల నుంచే ప్రతిపాదనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిని ప్రభుత్వం కూడా పరిగణనలోనికి తీసుకుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు.. గౌతంరెడ్డి పేరు మీద ఏర్పాటు చేసే అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం రూ. 225 కోట్లకుపైగా విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని గౌతంరెడ్డి తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సీఎం జగన్‌తో చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ఆస్తులన్నీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందినవేనని టాక్.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలోనే గౌతంరెడ్డి అంత్యక్రియలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ కాలేజీ దాదాపుగా వంద ఎకరాల విశాలమైన స్థలంలో ఉంటుంది. మెరిట్స్‌గా ప్రసిద్ధి చెందిన ఆ కాలేజీని ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగిస్తామని.. దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. దీనికి సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కాగా.. గత సోమవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో గుండెపోటుకు గురైన ఆయన కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అప్పటికే విషమించడంతో మేకపాటి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం 9.16 గంటలకు మరణించినట్లు అపోలో ఆసుపత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది