కత్తి మహేష్ కోసం రూ.17 లక్షలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- IndiaGlitz, [Friday,July 02 2021]
గత శనివారం ఉదయం ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు సమీపంలో కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కంటికి, తలకు బలమైన గాయాలయ్యాయి.
నెల్లూరులో చికిత్స అనంతరం కత్తి మహేష్ ని మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. కత్తి మహేష్ కంటికి, తలకు కీలకమైన సర్జరీలు వైద్యులు నిర్వహించారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో కత్తి మహేష్ ఆరోగ్యం ఓ సందర్భంలో విషమంగా కూడా మారింది. ప్రస్తుతం కత్తి మహేష్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
సర్జరీల అనంతరం మహేష్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ కొన్ని రోజులపాటు మహేష్ బెడ్ పైనే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. మహేష్ చికిత్స కోసం భారీగా డబ్బు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కత్తి మహేష్ చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ 17 లక్షల మొత్తాన్ని విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కత్తి మహేష్ కుటుంబంపై ఆర్థిక భారం తగ్గించేదే. వ్యక్తిగతంగా కత్తి మహేష్ సీఎం జగన్ మద్దతు దారుడు. గత ఎన్నికలో వైసిపి తరుపున మహేష్ ప్రచారం కూడా చేశారు. ఫిలిం క్రిటిక్ గ గుర్తింపు పొందిన మహెష్ నటుడిగా కూడా అవకాశాలు అందుకుంటున్నారు.