Yuvagalam : నారా లోకేష్ పాదయాత్రకు జగన్ సర్కార్ అనుమతి.. కండీషన్స్ అప్లయ్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్నిరోజులుగా వివిధ నిబంధనల పేరుతో పాదయాత్రకు సంబంధించి సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు పలుమార్లు డీజీపీకి లేఖ రాశారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రకు సోమవారం ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. నిబంధనలకు లోబడి లోకేష్ పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సూచించారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొన్నారు.
400 రోజులు.. 4000 వేల కిలోమీటర్లు పాదయాత్ర:
ఇదిలావుండగా తెలుగుదేశం పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్న నారా లోకేష్ ‘‘యువగళం’’ పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు తెరదీసిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయనున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే వుండేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. రాష్ట్రంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలే ప్రధాన అంశాలుగా ఆయన గళమెత్తనున్నారు. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళికను రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ప్లాన్ చేసుకున్నారు.
అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయాల్సిందేనా:
కాగా.. పాదయాత్ర చేస్తే అధికారం గ్యారెంటీ అనే సెంటిమెంట్ ప్రజల్లో , రాజకీయ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ఎన్నికల ముందే చాలా మంది నేతలు పాదయాత్రలు ప్లాన్ చేసుకుంటూ వుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 60 ఏళ్ల వయసులో పాదయాత్ర చేసి సీఎం పదవిని అందుకున్నారు. ఇక తండ్రి బాటలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేర్చుకున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments