జీవో నెం.35 రద్దు : ఆ కొన్ని థియేటర్లకే కాదు, అందరికీ వర్తింపు ... ఏపీ సర్కార్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్‌ రేట్ల వ్యవహారం గందరగోళానికి గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. జీవో నెం 35కి హైకోర్టు రద్దు చేసినా.. అది రాష్ట్రం మొత్తానికి వర్తించిందని హోంశాఖ చెప్పడమే ఇందుకు కారణం. దీంతో జీవో నెం 35 రద్దు చేయాల్సిందిగా ఎవరైతే పిటిషన్ వేశారో ఆ థియేటర్ యజమానులు మాత్రమే రేట్లు పెంచుకుంటారా అంటూ మిగిలిన వారు పెదవి విరిచారు. ఈ క్రమంలో సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. జీవో నెం.35 రద్దు రాష్ట్రంలోని అన్ని థియేటర్‌లకు వర్తిస్తుందని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌ సోమవారం హైకోర్టుకు తెలిపారు.

అన్ని వర్గాలకూ తక్కువ ధరకు వినోదాన్ని అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఏజీ స్పష్టం చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల వల్ల చాలా చోట్ల టికెట్‌ రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునే అవకాశం ఉంటుందని ఏజీ శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటు చేశామని, కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి కొంత సమయం కావాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. మొత్తం మీద జీవో నెం.35 రద్దు అయినా, టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం పొందాలంటే మాత్రం థియేటర్‌ యజమానులు జాయింట్‌ కలెక్టర్ల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు సినిమా టికెట్ల అమ్మకాలకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూవీ టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెం.142ని ఆదివారం జారీ చేసింది. దీని ప్రకారం ఆన్‌లైన్ సినిమా టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ నియంత్రలోనే జరుగుతాయి. ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాల బాధ్యతను ఏపీఎఫ్‌డీసీ (ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)కి అప్పగించింది ప్రభుత్వం.

ఇప్పటివరకు బుక్ మై షో, జస్ట్ టికెట్స్, పేటీఎం లాంటి ప్రైవేట్ ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. జనవరి 1 నుంచి ఐఆర్‌సీటీసీ తరహాలో టికెట్లను విక్రయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. ఇప్పటికే ఏపీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ టికెటింగ్ వెబ్‌సైట్ రూపొందుతోంది. ఈ విధానం వచ్చాక.. ఇకపై ప్రైవేట్ ప్లాట్‌ఫామ్‌లపై టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం, థియేటర్లలో టికెట్‌ కొనుక్కునే సదుపాయం ఉండదు.