ముదురుతోన్న సినిమా టికెట్ల వివాదం, రంగంలో ఏపీ సర్కార్.. కమిటీ ఏర్పాటు

  • IndiaGlitz, [Tuesday,December 28 2021]

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల పెంపు, థియేటర్ల మూసివేత అంశం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగానే ఉప్పు నిప్పుగా వున్న ఈ వ్యవహారానికి నాని చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా చేసింది. ఆ తర్వాతి నుంచి ఏపీ మంత్రులు- సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో వివాదానికి ముగింపు పలకాలని ఏపీ ప్రభుత్వం- సినీ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు.. సమాచార శాఖ కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శి ఉంటారు. టికెట్ల ధరలపై ఈ కమిటీ పరిశీలన జరిపి ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందజేయనుంది.

మరోవైపు జీవో నంబర్‌ 35పై ఏపీ ప్రభుత్వంతోనే తేల్చుకునేందుకు రెడీ అయ్యారు ఎగ్జిబిటర్స్‌. మంగళవారం సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నానితో భేటీకానున్నారు. ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్లు నాని అపాయింట్‌మెంట్‌ కోరినా.. ఆయన మాత్రం ఎగ్జిబిటర్స్‌తోనే మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 20 మంది ఎగ్జిబిటర్లతో మంత్రి నానితో చర్చలు జరుపనున్నారు. దీంతో సమావేశంలో ఏం చర్చిస్తారు? ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారన్నది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలతో పాటు సినీ జనాల్లో ఆసక్తి రేపుతోంది.

కాగా.. సినీ నిర్మాత దిల్‌రాజు నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఎవ‌రూ వ్య‌క్తిగ‌తంగా వ్యాఖ్య‌లు చేయొద్దని కోరారు. త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వ‌స్తుందని .. సినీ ఇండ‌స్ట్రీ నుంచి ఏపీ సీఎం, మంత్రుల‌ను క‌లవాల‌నుకుంటున్నామని దిల్‌రాజు చెప్పారు. తమకు అపాయింట్‌మెంట్ ఇస్తే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లుస్తామని... సినిమా, మీడియా రెండు వేరు కాదని ఆయన స్పష్టం చేశారు. మంచి సినిమాలు తీసి.. ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌నేదే తమ ల‌క్ష్యమని దిల్ రాజు అన్నారు.