Jogi naidu : నటుడు జోగి నాయుడికి కీలక పదవిని కట్టబెట్టిన జగన్.. ఏపీ సర్కార్ ఆదేశాలు
- IndiaGlitz, [Sunday,February 19 2023]
ఎన్నికల సీజన్ కావడంతో టాలీవుడ్‌లోని వైసీపీ మద్ధతుదారులకు వరుసపెట్టి పదవులు దక్కుతున్నాయి. ఇప్పటికే సినీనటలు అలీ, పోసాని కృష్ణ మురళీలకు పదవులు దక్కగా.. తాజాగా ఆ లిస్ట్‌లో చేరారు జోగి నాయుడు. ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ మిషన్ క్రియేటివ్ హెడ్‌గా ఆయనను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. జోగి నాయుడు నియామకానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని విజయవాడలోని ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమీషన్ సీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.
డైరెక్టర్ అవుదామని వచ్చి బుల్లితెరపైకి:
ఇకపోతే.. సినిమాలపై పిచ్చితో డైరెక్టర్ అవుదామని హైదరాబాద్‌కు వెళ్లారు జోగి నాయుడు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కృష్ణవంశీల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. అయితే అనుకోని విధంగా ఆయన బుల్లితెర వైపు వచ్చారు. 1998లో జెమినీ టీవీలో ప్రసారమైన ‘జోగి బ్రదర్స్’ కార్యక్రమంలో జోగి నాయుడు తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ఈ షోలో ఉత్తరాంధ్ర మాండలీకంతో మాట్లాడి ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కామెడీ టైమింగ్‌తోనే ఆయనకు పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. అలా దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు జోగి నాయుడు. ప్రముఖ యాంకర్ , సినీనటి ఝాన్సీని ప్రేమించి పెళ్లాడారు జోగి నాయుడు. ఈ దంపతులకు ధన్య అనే కుమార్తె కూడా వుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2014లో విడాకులు తీసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం అలీ, పోసానికి పదవులు:
ఇదిలావుండగా.. ఇటీవల కమెడియన్ అలీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చారు జగన్. ఆయనను ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీకి కూడా కీలక పదవిని కట్టబెట్టారు సీఎం జగన్. ఆయనను ఏపీ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.