వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ ధరల పెంపుకు జగన్ సర్కార్ ఓకే.. కానీ

  • IndiaGlitz, [Wednesday,January 11 2023]

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాల ప్రదర్శనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఏపీ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరపై గరిష్టంగా 45 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది. అయితే మైత్రీ సంస్థ టికెట్‌పై 70 కోరగా.. జగన్ సర్కార్ 45 వరకే అనుమతి ఇవ్వడం గమనార్హం.

స్పెషల్ షోలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్:

ఇదిలావుండగా.. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల స్పెషల్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. నిర్మాతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో జనవరి 12న ఉదయం 4 గంటలకు వీరసింహారెడ్డి, జనవరి 13న ఉదయం 4 గంటలకు వాల్తేర్ వీరయ్యల బెనిఫిట్ షోలు ప్రదర్శితం కానున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు తొలి రోజున ఆరు షోలు వేయడానికి వెసులుబాటు కలగనుంది. అయితే రెండో రోజు నుంచి మాత్రం రోజుకి ఐదు షోలు వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వీరసింహారెడ్డి విషయానికి వస్తే.. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా.. వాల్తేర్ వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ రోల్ పోషించారు. శృతీ హాసన్ , కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, బాబీ సింహా, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు.