Gorantla Madhav : అది మార్ఫింగ్ వీడియో కాకుంటే.. మాధవ్‌పై కఠిన చర్యలు తప్పవు : సజ్జల రామకృష్ణారెడ్డి
- IndiaGlitz, [Friday,August 05 2022]
మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ స్పందించింది. గురువారం వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాధవ్ వ్యవహారంపై సీఎం జగన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. అది మార్ఫింగ్ వీడియో అని మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ఒకవేళ ఒరిజినల్ అని తేలితే మాత్రం మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జల స్పష్టం చేశారు. మహిళలను అవమానించేలా ప్రవర్తించే ఎవరినైనా వైసీపీ క్షమించదన్నారు.
అసలేం జరిగిందంటే :
రెండ్రోజుల క్రితం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన దుస్తులు లేకుండా వున్న తన వీడియోలు, ఫోటోలను సదరు మహిళకు చూపించడంతో ఆమె ఈ వీడియోను వైరల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వెంటనే మీడియా సంస్థల్లోనూ ఈ వ్యవహారంపై కథనాలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. బాధ్యత గల ఎంపీగా వుంటూ అసభ్యకరంగా ప్రవర్తించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల సమస్యలపై పరిష్కరించాల్సిన ఎంపీ.. మహిళతో రాసలీలలు చేయడం ఎంటని వారు ప్రశ్నించారు. అటు ప్రతిపక్ష టీడీపీ నేతలు సైతం మాధవ్ వ్యవహారంపై భగ్గుమంటున్నారు. ఎంపీ పదవికి ఆయన తక్షణం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా మాధవ్ తీరు వుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఆ వీడియో వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను జిమ్ చేసేటప్పటి వీడియోలను మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అది ఫేక్ వీడియో అని తనను డ్యామేజ్ చేసి ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ వాళ్లు చేస్తున్న కుట్ర అని మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తానని.. ఈ ఘటన వెనుక వున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.