అన్‌లాక్ 5 నిబంధనల్ని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర హోంశాఖ జారీ చేసిన కోవిడ్19 అన్‌లాక్ 5 నిబంధనల్ని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారీగా వివిధ రంగాలను తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ కోవిడ్ అన్‌లాక్ 5 నిబంధనలను అక్టోబరు 31 తేదీ వరకూ అమల్లో ఉంటాయని ప్రబుత్వం స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని చోట్ల అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. అక్టోబరు 15 అనంతరం పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాధికారానికే విడిచిపెడుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్, దూరవిద్య తరగతుల నిర్వహించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల హాజరుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది.
పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ సూచించిన వివిధ ప్రమాణాలను పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం పరిశోధక విద్యార్ధులు, పట్టభద్రులు కళాశాలల్లో సైన్స్ ల్యాబరేటరీలకు హాజరయ్యేందుకు అక్టోబరు 15 నుంచి అనుమతినిచ్చింది. క్రీడాకారులకు మాత్రమే ఈతకొలనులు వినియోగించేందుకు అక్టోబరు 15 తర్వాత అనుమతి ఇవ్వనుంది. 50 శాతం సామర్ధ్యంతో సినిమాలు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వినోద పార్కులు, ప్రాంతాలను కూడా అక్టోబరు 15 తర్వాత మాత్రమే తెరుచుకునేందుకు అనుమతి జారీ చేస్తున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల వాణిజ్య ప్రదర్శనలను కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సామాజిక, విద్య, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ పరమైన సమావేశాలకు వంద మందికి మాత్రమే ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
అక్టోబరు 31 తేదీ వరకూ లాక్ డౌన్ నిబంధనలను కేవలం కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 65 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు అత్యవసరం అయితే మినహా బయట తిరగకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేస్తున్న కార్యాలయాలు, ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మాస్కులు తప్పని సరి అని ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్య సముదాయాలు, దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. బహిరంగంగా ఉమ్మి వేయటంపైనా నిషేధం విధించింది. అలా చేస్తే జరిమానా విధించాలని స్థానిక అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత మేర వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే పాండమిక్ డిసీజెస్ యాక్టు, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments