తెలుగువారి ఫేవరేట్ 'చింతామణి' డ్రామాపై ఏపీ సర్కార్ నిషేధం.. ప్రదర్శిస్తే కఠిన చర్యలు
- IndiaGlitz, [Tuesday,January 18 2022]
సినిమాలు, సీరియళ్లు రాకముందు తెలుగునాట ప్రజలకు వినోదం అందించింది నాటకాలే. వారాంతాలతో పాటు పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ నాటకాలు ఊరూవాడా రంజింపజేసేవి. నాటకాల నుంచే దిగ్గజ కళాకారులు సినీ రంగానికి పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, జగ్గయ్య, కాంతారావు, సావిత్రి వంటి వారు నాటకాలు వేసేవారు. ఇకపోతే.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘‘చింతామణి’’ నాటకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ నాటకంపై ఇటీవలి కాలంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇది తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిని నిషేధించాలని ఆర్య వైశ్య నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తక్షణం చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను ఆదేశించింది.
కాగా తెలుగు నాటక రంగంలో ‘‘చింతామణి’’కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 20వ శతాబ్దం కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, శ్రీహరి, భవానీ శంకరం తదితర కీలక పాత్రలు ఉన్నాయి . అయితే సుబ్బిశెట్టి అనే పాత్ర చింతామణి అనే మహిళ వ్యామోహంలో పడి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆర్యవైశ్య సామాజిక వర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.