close
Choose your channels

ఏప్రిల్‌ నెలలోనే ఏపీ ఎన్నికలు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు..

Tuesday, January 23, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏప్రిల్‌ నెలలోనే ఏపీ ఎన్నికలు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు..

ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తిగా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. అన్ని పార్టీలు రణరంగంలో దూకేందుకు పూర్తిగా రెడీ అయ్యాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇటీవలే రాష్ట్రంలో పర్యటించి అధికారులతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్‍గా ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 16న ఎన్నికల తేదీగా భావించి..

ఈ క్రమంలోనే ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి అక్కడి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏపీలో కూడా ఏప్రిల్‌లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే ఏప్రిల్ నెలలోనే ఎన్నికలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ తొలి వారంలో ఎన్నికలు జరగొచ్చని తెలిపారు. దీంతో అదే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఖాయమైంది.

ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్..

ఇప్పటికే ఎన్నికల తేదీలపై రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. దాంతో ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ రిఫరెన్స్‌గా ఇచ్చినట్లు ఈసీ వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలి దశలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. కాగా 2019లో మార్చి 10న ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో (ఏప్రిల్‌ 11, ఏప్రిల్‌ 18, ఏప్రిల్‌ 23, ఏప్రిల్‌ 29, మే 6, మే 12, మే 19) ఎన్నికలు నిర్వహించింది. తొలి దశలో ఏప్రిల్ 11న ఏపీ ఎన్నికలు జరగగా.. మే 23న ఫలితాలు వెల్లడించింది.

అధికారుల బదిలీలకు ఆదేశాలు..

మరోవైపు ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. జనవరి 25వ తేదీలోపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలను పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు పాల్గొన్నారు. ఎన్నికల విధులతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాలని సీఈవో ఆదేశించారు. ఇప్పటికే కొన్ని శాఖల్లో బదిలీలు జరిగాయని.. మిగిలిన అధికారులను గడువు తేదీ లోపు బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఓటర్ల తుది జాబితా విడుదల..

ఇదిలా ఉంటే ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4.08 కోట్ల ఓటర్లు ఉన్నారని.. గతేడాది అక్టోబర్ 27న జారీ చేసిన డ్రాఫ్ట్ జాబితా తర్వాత 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. ఇందులో యువ ఓటర్లు 5 లక్షల మేర పెరిగారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు, జాబితాలో పేరు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.