AP Election :ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్.. మార్చిలో పోలింగ్..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల సమరానికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గత ఎన్నికలు జరిగిన సమయం కంటే ఈసారి మందుగానే ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10న ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా సీఈసీ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం కూడా ఇచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 22, 23న ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా కుమార్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హడావిడి మొదలైంది.
2019 సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను మార్చి 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ గత ఎన్నికల కంటే 20-30 రోజులు ముందుగానే విడుదల చేయనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మార్చిలో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించనున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల మార్పులతో బిజీగా ఉంటే.. టీడీపీ-జనసేన కూడా అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు.
కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2019తో పోలిస్తే ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడిన సంగతి తెలసిందే. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ముందుకు రావాలని అనుకుంటోందన్న సంకేతాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. ఎన్నికలకు వైసీపీ పూర్తి సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల అధికారుల నుంచి సమాచారం రావడంతోనే వైసీపీ అధినేత ఎన్నికల గురించి కచ్చితమైన వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా తాము కూడా సిద్ధంగా ఉన్నామని టీడీపీ, జనసేన కూడా ప్రకటించాయి. మొత్తానికి ఏపీలో మరో రెండు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout