ఏపీలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. పోటీకి టీడీపీ దూరం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్, మున్సిపల్ పోరు ముగియగానే.. తాజాగా మరో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకుగాను గురువారం సాయంత్రం ఏపీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్-08న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే అనగా.. ఏప్రిల్-10న ఫలితాలు వెలువడనున్నాయి. ఏప్రిల్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని నోటిఫికేషన్లో ఎస్ఈసీ పేర్కొంది. ఇక రీపోలింగ్ విషయానికొస్తే.. ఏదైనా అనివార్య కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడినా లేదా అంతరాలు జరిగినా.. ఈనెల 9న రీపోలింగ్ జరగనుంది.
ఏకగ్రీవాలకు ఓకే..
ఇదిలా ఉంటే.. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గతంలో ఎన్నికలు జరగ్గా చాలా వరకూ ఏకగ్రీవాలయ్యాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు కోర్టు మెట్లెక్కాయి. అయితే.. తాజాగా పై విధంగా కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్‌తో 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా.. మొత్తం 2.82 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా.. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనుండగా... ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన విషయం విదితమే. అయితే.. కోర్టు పరిధిలో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఉండబోవని కూడా ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
పరిషత్ ఎన్నికలకు టీడీపీ దూరం!
పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని, అందుకే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయదన్న మాట. అయితే.. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి గెలిచిందని టీడీపీ భావిస్తోంది. అందుకు నిరసనగానే.. టీడీపీ ఇలా నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతేకాదు.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నప్పుడే వైసీపీ రెచ్చిపోయిందని, ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజార్చడం ఖాయం అని.. ప్రస్తుతం ఎస్ఈసీగా ఉన్న నీలం సాహ్నీ వైసీపీకే పాజిటివ్‌గా ఉంటారని.. అందుకే పరిషత్ ఎన్నికలకు వెళ్లకూడదని టీడీపీ భావించినట్లు తెలుస్తోవంది. వాస్తవానికి చాలా వరకు సర్పంచ్, మున్సిపల్ పోరులో పాక్షికంగా ఎన్నికలు జరిగినప్పటికీ ఎక్కడా టీడీపీ సత్తా చాటు కోలేకపోగా.. కంచుకోటలను సైతం వైసీపీకి అప్పగించాల్సిన పరిస్థితి. అందుకే ఈ రెండు ఎన్నికలతో భయపడే ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని వైసీపీ నేతలు, అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి ఈ విమర్శలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout