ఏపీ డిప్యూటీ సీఎం అంజద్‌కు కరోనా.. హైదరాబాద్‌కు తరలింపు!
- IndiaGlitz, [Monday,July 13 2020]
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రముఖ రాజకీయ నేతలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా రావడం.. కోలుకోవడం కూడా చకచకా జరిగిపోయాయి. అటు ఏపీలోనూ డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు కరోనా సోకింది. కొద్ది రోజుల క్రితమే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కడపలోని రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే అంజద్ బాషాకు కార్డియో థొరాసిక్ సమస్యలుండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన.. గత శుక్రవారం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్‌లో చేరారు.
మెరుగైన చికిత్స కోసం.. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు..
ఏం జరిగిందో ఏమో కానీ అంజద్ బాషా.. ఆదివారం రాత్రి తిరుపతి కలెక్టర్‌తో చర్చించి స్విమ్స్ నుంచి హైదరాబాద్‌కు ఆయనను తరలించారు. ఈ విషయాన్ని స్వయంగా స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ మీడియాకు తెలిపారు. అంజద్ బాషాకు కరోనా సోకిందని.. కానీ ఆ లక్షణాలేవీ లేవని.. ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా లక్షణాలు లేవని వెంగమ్మ తెలిపారు. గతంలో అంజద్ బాషాకు కార్డియో థొరాసిక్ సమస్య ఉండేదని.. ఆ సమస్య తీవ్రమవుతుందనే ఆయన ముందు జాగ్రత్తగా స్విమ్స్‌లో జాయిన్ అయ్యారని తెలిపారు. అయితే పరీక్షలు నిర్వహించగా కార్డియో థొరాసిక్ సమస్యలేవీ అంజద్ బాషాలో కనిపించలేదని వైద్యులు చెప్పడంతో ఆయన కలెక్టర్‌తో మాట్లాడి హైదరాబాద్ వెళ్లారని వెంగమ్మ తెలిపారు. ప్రస్తుతం అంజద్ బాషా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.