జగన్ పిలవగానే.. మోకాళ్లపై కూర్చొని మాట్లాడిన ఐఏఎస్ అధికారి, ఫోటో వైరల్
- IndiaGlitz, [Thursday,January 27 2022]
బ్యూరోక్రాట్లు ముఖ్యమంత్రులు, మంత్రుల వద్ద మితిమీరిన వినయం ప్రదర్శిస్తున్నారు. బాధ్యతాయుతమైన కలెక్టర్ పదవిలో వున్న ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లుమొక్కడం తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా వుండాల్సిన ఐఏఎస్ అధికారి ఓ పార్టీ నాయకుడిలా కేసీఆర్ కాళ్లు మొక్కడమేంటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అనంతరకాలంలో ఆయన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ కూడా అయిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఈ తరహా సీన్ ఆంధ్రాలో జరిగింది. న్యూఇయర్ సందర్భంగా విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ పనిచేస్తున్న సిహెచ్ కిశోర్ కుమార్ మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. అనంతరం ఆ వివాదం సద్దుమణిగింది.
తాజాగా ఏపీలో నిర్వహించిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రిపబ్లికే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఐఏఎస్ అధికారులతో సీఎం జగన్ ముచ్చటించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పిలవగానే వచ్చిన సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. మోకాళ్లపై కూర్చుని ఆయనతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి సమీపంలోనే అంత మంది ప్రముఖులు ఉండగా.. ఇలా మోకాళ్ల పైన కూర్చొని సీఎంతో చర్చించటం పైన నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. కాగా ఏపీ సీఎంవో ఇప్పుడు ప్రవీణ్ ప్రకాశ్ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.