YS Jagan Mohan reddy : ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు.. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ జగన్ ట్వీట్
- IndiaGlitz, [Monday,May 30 2022]
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలనుద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
‘‘ మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం.
రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
2019 ఎన్నికల్లో వైసీపీ సునామీ.. 151 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో గెలుపు :
2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మ్రోగించిన సంగతి తెలిసిందే. మొత్తం 175 సీట్లకు గాను ఏకంగా 151 సీట్లలో విజయం సాధించి అప్పటి అధికార టీడీపీకి చుక్కలు చూపెట్టింది. అనంతరం 2019, మే 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 చోట్ల గెలుపొందింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు సారధ్యంలోని టీడీపీ కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, నాడు నేడు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనలో సరికొత్త సంస్కరణలు చేపట్టారు జగన్.
రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022