YS Jagan:చంద్రబాబు మాటలు నమ్మొద్దు.. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, దసరాకి పెండింగ్ డీఏ : ఏపీ ఎన్జీవో సభలో జగన్
- IndiaGlitz, [Monday,August 21 2023]
ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సోమవారం విజయవాడలో జరిగిన ఏపీ ఎన్జీవో సంఘం 21వ రాష్ట్ర మహాసభలకు జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో వున్న డీఏను దసరా కానుకగా ఇవ్వనున్నట్లు తెలిపారు. హెల్త్ సెక్టార్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 లక్షల 19 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించానని సీఎం వెల్లడించారు. ఇందులో ఒక్క హెల్త్ సెక్టార్లోనే 53 వేల మందిని నియమించామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 2,06,668 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని.. వేతనాల కోసమే దాదాపు రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
చంద్రబాబు దృష్టిలో అందరూ లంచగొండులే :
ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు సీఎం. టీడీపీ హయాంలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని.. ఉద్యోగులంటే చంద్రబాబుకు చులకన భావమన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులతో అడ్డగోలుగా వ్యవహరించిందని సీఎం ఆరోపించారు. బాబు దృష్టిలో కొందరే మంచోళ్లు అని.. అందరూ లంచగొండులేనని జగన్ అన్నారు. అసలు ఉద్యోగులపై నిందలు వేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు.
జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ :
గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకుందని.. కొన్ని మాత్రమే ఉద్యోగులకు మిగిల్చారని సీఎం ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో 54 ప్రభుత్వ రంగం సంస్థలను మూసేశారని.. ఆయన కాలంలో ఆర్టీసీ, ప్రభుత్వ పాఠశాలల పరిస్ధితి ఎలా వుండేదని జగన్ ప్రశ్నించారు. అలాంటి చంద్రబాబు ఉద్యోగులకు న్యాయం చేయగలరా, లేదా అన్నది ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు. చంద్రబాబు, ఆయన మనుషులకు తమ ప్రభుత్వంపై కడుపు మంట అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులపై భౌతికదాడులు :
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, గ్రామ స్వరాజ్య సాధనలో దేశానికే దిక్సూచిగా నిలిచామన్నారు. తమ ప్రభుత్వ సక్సెస్ ఉద్యోగులే కారణమని జగన్ పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే మాటల్ని, కట్టు కథల్ని నమ్మవద్దు అని సీఎం కోరారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద పగబట్టి భౌతిక దాడులు జరుపుతున్నారని, పుంగనూరులో 47 మంది పోలీసులపై దాడి చేశారని జగన్ ఆరోపించారు.