సీఎం పర్యటన.. విశాఖలో జనానికి ‘‘ట్రాఫిక్’’ కష్టాలు.. పోలీసులపై జగన్ ఆగ్రహం

బుధవారం విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్‌ను నిలిపివేసి, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని.. దీనిపై విచారణ చేపట్టాలని డీజీపీని జగన్ ఆదేశించారు.

కాగా.. నిన్న సీఎం జగన్ పర్యటన విశాఖ ప్రజలను తీవ్రంగా ఇబ్బందికి గురిచేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేయడంతో గంటల తరబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరుకావడానికి షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు జగన్ విశాఖ చేరుకోవాల్సి వుండగా.. 11.45కు వచ్చారు.

మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బయల్దేరాల్సింది.. సాయంత్రం 4 వరకు జగన్ అక్కడే ఉన్నారు. దీంతో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఎన్‌ఏడీ కూడలి నుంచి పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో కార్యాలయాలకు వెళ్లేవారు, ఆసుపత్రులకు వెళ్లేవారు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.