ఈ తోడేళ్లంతా ఎందుకు ఏకమవుతున్నాయి.. విపక్ష నేతలను ఉద్ధేశించి జగన్ వ్యాఖ్యలు
- IndiaGlitz, [Monday,March 20 2023]
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు విజయం సాధించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా.. లోలోపల టెన్షన్ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే పరిస్ధితి రీపిట్ అయితే తమ పరిస్ధితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటల్లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది.
దత్తపుత్రుడు, దుష్ట చతుష్టంతో యుద్ధం చేస్తున్నాం:
వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన నిధులను జగన్ విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా ఈ తోడేళ్లంతా ఎందుకు ఒక్కటవుతున్నాయని వ్యాఖ్యానించారు. పొత్తుల కోసం విపక్షాలు ఎందుకు వెంపర్లాడుతున్నాయని జగన్ ప్రశ్నించారు. మన ప్రభుత్వంతో కనీసం పోల్చుకోలేని వాళ్లంతా మనపై రాళ్లు వేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని జగన్ స్పష్టం చేశారు. దత్తపుత్రుడు, దుష్ట చతుష్టంతో మనం యుద్ధం చేస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.
చంద్రబాబు పెట్టిన బకాయిలను మేమే కట్టాం:
విద్యార్ధులకు ప్రతి మూడు నెలలకొకసారి ఫీజులతో పాటు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలతో చదువుకునే విద్యార్ధుల సంఖ్య పెరిగిందని.. ప్రభుత్వ పాఠశాలలను, కార్పోరేట్ స్కూళ్లతో పోటీపడేలా చేస్తున్నామని జగన్ అన్నారు. ఎనిమిదవ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు అందించామని.. ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే వుందని సీఎం పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని.. భారతదేశంలో విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలోని బకాయిలను కూడా తామే కట్టామని.. కళాశాలల్లో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే తామే పరిష్కరిస్తామని జగన్ వెల్లడించారు.