ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్ధుల అవస్థలు ... విమాన ఖర్చులు భరించండి: అధికారులకు జగన్ ఆదేశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అన్ని దేశాలు వారి పౌరుల క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే భారతీయుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ చర్యలు చేపట్టింది. పోలండ్, హంగరీ మీదుగా భారతీయులను తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు కూడా వుండటంతో వారి తరలింపుపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి కేటీఆర్‌లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

తాజాగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులకు విమాన టికెట్లు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టికెట్లు కొనుగోలు చేసుకోలేని విద్యార్థులకు ప్రభుత్వమే భరించాలని ఆయన సూచించారు. ఢిల్లీకి చేరుకునే విద్యార్థులకు అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు చేర్పించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధికారులను ఆదేశించారు. అందుకు తగినట్లు ఏపీ భవన్‌ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సీనియర్‌ ఐఏఎస్‌ కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. విద్యార్థులకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు.