CM YS Jagan:జగన్ కీలక నిర్ణయం : ‘ ఆడుదాం ఆంధ్ర ’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు , ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్‌కి ప్లాన్
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్షేమ పథకాలు, అభివృద్ధి , పాలనలో సంస్కరణలతో ముందుకు వెళ్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపైనా దృష్టి సారించారు. దీనిలో భాగంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించాలని జగన్ అధికారులను ఆదేశించారు. పోటీల నిమిత్తం ప్రతీ మండలంలో మైదానాలను ఏర్పాటు చేసుకోవాలని.. గ్రామం, వార్డు, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు వుండాలని జగన్ ఆదేశించారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో ఖో, 3 కిలోమీటర్ల మారథాన్, యోగా, టెన్నీకాయిట్, ఇతర సంప్రదాయ క్రీడల పోటీలను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. మొత్తం 46 రోజులు పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్లలో ఈ పోటీలు నిర్వహిస్తారు.
సీఎస్కే మేనేజ్మెంట్ సాయంతో క్రీడాకారులకు సాయం :
గ్రామస్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసేలా అధికారులు, క్రీడా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తయారు చేయడం కోసం చెన్నై సూపర్‌కింగ్స్ మేనేజ్మెంట్ సాయం తీసుకుంటామని జగన్ తెలిపారు. క్రికెట్ లాంటి ఆటలో సీఎస్కె మార్గదర్శకం చేస్తుందని... భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ మేనేజిమెంట్ సాయం కూడా తీసుకుని.. ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ జట్టు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అందులో ఆంధ్రా ఆటగాళ్లు ఎక్కువమంది ఉండేలా పని చేస్తున్నామని జగన్ తెలిపారు. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ మేనేజిమెంట్ ఆధ్వర్యంలో మూడు క్రికెట్ స్టేడియాల్లో క్రికెటర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జగన్ వెల్లడించారు.
గ్రామస్థాయి వారికి కూడా క్రీడా సామాగ్రి :
గ్రామ స్థాయిలో ఆడేవారికి కూడా క్రీడా సామాగ్రిని అందించాలని.. విజేతలకు బహుమతులతో పాటు కిట్లను కూడా అందించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని జగన్ ఆదేశించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ లాంటి క్రీడాకారులు రాష్ట్ర యువతకు స్పూర్తిదాయకులన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com