YS Jagan:వచ్చే 6 నెలలూ కీలకం.. గేర్ మార్చాల్సిందే , వైనాట్ 175 కష్టం కాదు : పార్టీ నేతలతో వైఎస్ జగన్
- IndiaGlitz, [Wednesday,September 27 2023]
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వై నాట్ 175 నినాదం ఇచ్చారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే నేతలను జనంలో వుండేలా చర్యలు తీసుకున్నారు. కాస్త కష్టపడితే 175కి 175 సీట్లు గెలవడం పెద్ద కష్టం ఏమి కాదని జగన్ తొలి నుంచే చెబుతూనే వస్తున్నారు. తాజాగా మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కో ఆర్డినేటర్లు, పార్టీ రీజినల్ ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వచ్చే 6 నెలలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చిందని, ప్రజలకు నిరంతరం అందుబాటులో వుండాలని జగన్ అన్నారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలని.. నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. టికెట్లు దక్కనివారికి మరో రకంగా అవకాశం కల్పిస్తామని.. టికెట్లపై ప్రతి ఒక్కరూ తాను తీసుకునే నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. లీడర్, పార్టీ మీద నమ్మకం వుంచాలని.. సర్వేలు కూడా తుది దశలోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలో చేపట్టనున్న జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాల గురించి సీఎం నేతలకు వివరించారు.
జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఆరోగ్యపరంగా ప్రతి ఇంటిని జల్లెడ పడతామని.. ఉచితంగా మందులు, పరీక్షలు చేయిస్తామని జగన్ చెప్పారు. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో చేయూతనిస్తామని.. ఇందులో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను మమేకం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందని సీఎం తెలిపారు.