YS Jagan:వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల చేసిన జగన్.. 18,883 జంటలకు లబ్ధి

  • IndiaGlitz, [Wednesday,August 09 2023]

నిరుపేద జంటలను ఆదుకునే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్ధిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని సీఎం జమ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని జగన్ అందజేశారు. ఇప్పుడు అందించిన సాయంతో కలిపి గడిచిన 9 నెలల్లోనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.267.20 కోట్లను ప్రభుత్వం జమ చేసినట్లయ్యింది. దూదేకుల, నూర్ భాషా వర్గాలకు కూడా ఈసారి షాదీ తోఫాను అమలు చేస్తున్నారు జగన్.

పెళ్లిళ్లు అయిన ప్రత ఒక్కరికీ సాయం :

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల అమలు కోసం రూ.140 కోట్ల నిధులను విడుదల చేస్తున్నామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లిళ్లు అయిన అందరికీ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు సీఎం చెప్పారు. తల్లుల ఖాతాలోనే నిధులు విడుదల చేస్తామని.. 18,883 మంది జంటలకు లబ్ధి జరుగుతుందని జగన్ అన్నారు. మైనార్టీ వర్గాలకు షాదీ తోఫా ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి చెల్లెమ్మకు డిగ్రీ వరకు చదువు వుండాలని.. ఏటా నాలుగు విడతల్లో నిధులు పంపిణీ చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

చదువే బ్రహ్మాస్త్రం :

చదువు అనే బ్రహ్మాస్త్రం ప్రతి ఒక్కరి చేతిలో వుండాలని.. గత ప్రభుత్వంలో ఏదో చేశామంటే చేశామన్న విధంగా వుండేదని చురకలంటించారు. ఏ రోజు కూడా గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదని ఎద్దేవా చేశారు. గతంలో లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారని.. వసతి దీవెన, విద్యా దీవెన పేదల పెద్ద చదువులకు తోడుగా నిలబడుతోందని ముఖ్యమంత్రి అన్నారు. వసతి దీవెన ద్వారా ఒక్కొక్కరికి రూ.20 వేలు ఖర్చు చేస్తున్నామని.. షాదీ తోఫా ద్వారా రూ.లక్ష ఇచ్చి మైనార్టీలకు అండగా వుంటున్నామని జగన్ పేర్కొన్నారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమని జగన్ వివరించారు. షాదీ తోఫా, వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాలకు అర్హతగా పదవ తరగతి వుండాలి, 18 ఏళ్లు నిండాలన్న నిబంధన పెట్టామని సీఎం తెలిపారు.