YS Jagan:జగన్ పెద్ద మనసు.. నాలుగేళ్లుగా పథకాలు అందుకోని వారికి లబ్ధి, 2.62 లక్షల మంది ఖాతాల్లోకి నగదు
- IndiaGlitz, [Thursday,August 24 2023]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. అర్హత వుండి సంక్షేమ పథకాలను ప్రతిఫలాలను అందుకోలేకపోయిన 2 లక్షల 62 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ ఈరోజు నగదు జమ చేశారు.2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్ల మందికి ప్రభుత్వం అందజేసింది. 1,49,875 మందికి పెన్షన్లు.. 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు.. 2,00,312 మందికి రేషన్ కార్డులు.. 12,069 మందికి ఇళ్ల పట్టాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడమని జగన్ అన్నారు. ఏదైనా కారణం వల్ల ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందని వారికి లబ్ధిచేకూర్చనున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. కుల, మత , ప్రాంతం , పార్టీ చూడకుండా పథకాలు అందిస్తున్నామని చెప్పారు . కొత్త పెన్షన్లతో కలిపి మొత్తం సంఖ్య 64 లక్షల 27 వేలకు చేరుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వం రూ.1000 ఇచ్చిన పెన్షన్ను తమ ప్రభుత్వం రూ.2,750కి పెంచిందన్నారు. అలాగే జగనన్న చేదోడు ద్వారా 43,131 మందికి సాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజలకు మంచి చేసేందుకు నాలుగు అడుగులు ముందుకేసి .. దానిని నిలబెట్టుకుంటూ పలు కారణాల వల్ల పథకాల అందుకోలేకపోయిన వారికి లబ్ధి కలిగిస్తున్నామని జగన్ చెప్పారు.