నెమ్మదిగా వచ్చేయండి.. విశాఖలోనూ జూబ్లీహిల్స్ క్రియేట్ చేద్దాం, టాలీవుడ్‌కు జగన్ వరాలు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందని జగన్ పేర్కొన్నారు. ఆ పాలసీ ద్వారా పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కొద్దికాలంగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసమే కమిటీని ఏర్పాటు చేశామని.. ఈ కమిటీ తరచూ సమావేశమై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తనకు చెబుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేకుంటే ఎక్కువ, తక్కువ వసూళ్లు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. తాను, చిరంజీవి కలిసి కూర్చొని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించామని జగన్ గుర్తుచేశారు. అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని... హీరో, హీరోయిన్, దర్శకుడు పారితోషికం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయని సీఎం అన్నారు.
అలాంటి సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడని... అటువంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలని జగన్ తెలిపారు. అలా లేకుంటే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకు రారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి సినిమాలకు వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని చెప్పామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో షూటింగులు ప్రమోట్ చేసేందుకు కొంత పర్సంటేజ్ కేటాయించామని.. దీనిపై మంత్రి పేర్ని నాని ఇప్పటికే దర్శకులు, నిర్మాతలతో మాట్లాడారని జగన్ వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం ప్రభుత్వానికి, నిర్మాతలకు శ్రేయస్కరమని ప్రభుత్వ ఉద్దేశ్యమని జగన్ చెప్పారు. ఇదే సమయంలో ఓటీటీల నుంచి ఎదురవుతున్న పోటీపైనా చిరంజీవితో చర్చించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కనీస ఆదాయం కూడా రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుందని.. అందుకే రీజనబుల్ రేట్లు దిశగా వెళ్లామని జగన్ తెలిపారు. ప్రేక్షకులపై భారం పడకుండా.. సినీ పరిశ్రమకు సైతం మేలు జరిగేలా రేట్లు సవరించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఐదో షో కూడా తీసుకురావాలని అడిగారని.... అయితే అది అందరికీ వర్తిస్తుందని, చిన్న సినిమాలకూ అవే రేట్లు వర్తిస్తాయని జగన్ పేర్కొన్నారు.
తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా నుంచి ఎక్కువగా ఆదాయం వెళుతోందని.. ఏపీలో జనాభా, ప్రేక్షకులు, థియేటర్లు ఎక్కువ అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సినీ పరిశ్రమ నెమ్మదిగా విశాఖపట్నం రావాలని... అలా వచ్చేందుకు దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. అక్కడ స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే వాళ్లకు స్థలాలు కేటాయిస్తామని, విశాఖలోనూ జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లతో విశాఖకు పోటీపడగల సత్తా వుందని జగన్ చెప్పారు. ఇవాళ కాకపోయినా పదేళ్లకో.. పదిహేనేళ్లకో మహానగరాలతో పోటీ పడుతుందని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments