CM YS Jagan:దోచుకోవడం, పంచుకోవడం నా విధానం కాదు.. త్వరలో కురుక్షేత్ర యుద్ధమే : సీఎం వైఎస్ జగన్
- IndiaGlitz, [Friday,September 29 2023]
త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. శుక్రవారం విజయవాడలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ వాహన మిత్ర నిధులను ఆయన లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. లంచం, వివక్ష లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కాం, అమరావతి పేరుతో స్కాములు చేసిన గత ప్రభుత్వం యుద్ధం చేస్తున్నామని జగన్ తెలిపారు. దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి.. దోచుకున్నది పంచుకునేందుకు వాళ్లకు అధికారం కావాలని సీఎం ఫైర్ అయ్యారు. వాళ్లకు లాగా తనకు గజదొంగల ముఠా తోడుగా లేదని.. దోచుకుని పంచుకుని తినడం తన విధానం కాదని జగన్ ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తే.. తమ ప్రభుత్వం ప్రతీ హామీని అమలు చేసిందని సీఎం పేర్కొన్నారు. ఈబీసీ నేస్తంతో రూ.1,257 కోట్లు.. కాపునేస్తంతో రూ.2,029 కోట్లు సాయం అందించామని జగన్ తెలిపారు. చిరు వ్యాపారులకు రూ.2,956 కోట్లు... రైతన్నకు రూ.30,985 కోట్లు సాయం చేశామని సీఎం వెల్లడించారు. పాదయాత్రలో అందరి కష్టాలను చూశామని.. వాలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశామని జగన్ చెప్పారు. పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని.. జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికేట్లు ఇంటికే అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు వుంచుకోవాలని జగన్ పేర్కొన్నారు.
బతుకు బండి లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకమని సీఎం తెలిపారు. వాహనం ఇన్సూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్ వాహన మిత్ర పథకం అందుబాటులోకి తెచ్చామని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు రూ.276 కోట్లు జమ చేస్తున్నామని.. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ధి జరుగుతుందని సీఎం తెలిపారు. ఇది జగనన్న ప్రభుత్వం కాదని, మీ అందరి ప్రభుత్వమని ముఖ్యమంత్రి చెప్పారు.