సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో నీలగిరి కొండల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. సాయితేజ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
సాయితేజ సైన్యంలో డ్రైవర్‌గా తన ప్రస్థానం ప్రారంభించి ఏకంగా సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారి స్థాయి వరకూ ఎదిగారు. ఆయన తిరుపతి ఎంఆర్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, మదనపల్లెలో ఇంటర్ పూర్తి చేశారు. మదనపల్లెలో డిగ్రీ చేరిన కొన్ని నెలల్లోనే ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుని గుంటూరులో ఇందుకు శిక్షణ తీసుకుని లక్ష్యాన్ని అందుకున్నారు.
2012లో ఆర్మీ సిపాయిగా బెంగళూరు రెజిమెంట్ నుంచి ఎంపికైన సాయితేజ.. కొంతకాలం జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వర్తించారు. ఏడాది తర్వాత పరీక్ష రాసి పారా కమాండోగా సెలక్ట్ అయ్యారు. ఎంపిక నుంచి శిక్షణ వరకు అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొని సాయితేజ పారా కమాండో అయ్యారు. ఆకాశమార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి, వారిని మట్టి కరిపించే పారా ట్రూపర్‌గా ఆయన ఎదిగారు. ఇందుకోసం కఠోర శిక్షణ పొందారు. అనంతరం కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి సాయితేజ చేరుకున్నారు. ఈ క్రమంలోనే త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆయనలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి.. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్‌కు బిపిన్ రావత్‌తో పాటు వెళుతూ.. నీలగిరి కొండల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో సాయితేజ కన్నుమూశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments