రేపు జగన్‌ను కలవనున్న చిరంజీవి..  మెగాస్టార్ వెంట ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్..?

సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్‌ రేట్ల వివాదానికి ఏదో ఒక పరిష్కారం చూపాలని అటు టాలీవుడ్ పెద్దలు.. ఇటు ఏపీ ప్రభుత్వం గట్టి పట్టుదలగా వున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు గురువారం సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. చిరంజీవితో పాటు ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంను కలిసే అవకాశం ఉంది. వీరంతా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అయితే చిరు వెంట జగన్ వద్దకు వెళ్లే ప్రముఖులకు సంబంధించి గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంట్రెస్టింట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఫిబ్రవరి 10న జగన్ భేటీలో భాగం కాబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అలాగే దర్శకులు రాజమౌళి, కొరటాల శివ కూడా జగన్‌ను కలిసే వారి లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10 తర్వాత కచ్చితంగా సినిమా కష్టాలకు ఓ పరిష్కారం వస్తుందని పరిశ్రమ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఈ సమావేశంలో పాల్గొనేలా చిరంజీవి ఒప్పించినట్లుగా సమాచారం. దీంతో రేపు చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ జగన్‌ని కలిసే లిస్ట్‌లోకి చేరిపోయారు.

ఇది ఒక విధంగా అరుదైన సంఘటన అని చెప్పాలి. టాలీవుడ్‌లోని ముగ్గురు టాప్ స్టార్స్ ఒకే మాటపై నిలబడి.. పరిశ్రమ మంచి కోసం కదలిరావడం గొప్ప విషయం. ఈ మధ్య కాలంలో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి కనిపించలేదు. ఎన్టీఆర్‌ను మాత్రం మహేశ్ పలు సందర్భాల్లో కలిశారు. మహేశ్ నటించిన భరత్ అనే నేనుకు చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్ వెళ్లి సినిమా బాగా ఆడాలని కోరారు.