500 తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన సీఎం జగన్.. బెజవాడలో పరుగులు
- IndiaGlitz, [Friday,April 01 2022]
విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద శుక్రవారం తల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్ వాహనాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. దాదాపుగా 500 వాహనాలను ఒకేసారి ప్రారంభించారు జగన్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో అరకొర సదుపాయాలు తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లో ఉండేవన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎయిర్ కండిషన్ సదుపాయంతో తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకువచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. గర్బం దాల్చిన అక్కాచెల్లెమ్మలను వాహనాల్లో తీసుకువెళ్లి, తిరిగి వారిని ఇంటి వద్ద దింపేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గర్బంతో ఉన్న మహిళలకు ప్రపంచ ఆరోగ్య సంస్ద సూచనలకు అనుగుణంగా మందులు అందజేస్తున్నామని ఆయన వివరించారు.
మరోవైపు.. ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల మధ్య కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతృ, శిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఆమెను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్ ఫొటో అప్‌లోడ్ చేయాలి. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రసవానంతరం బాలింతకు ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద వివిధ అవసరాల కోసం రూ.5 వేలు చెల్లిస్తుంది.