ఏపీలో ఉనికిలోకి కొత్త జిల్లాలు, ఇకపై మొత్తం 26 - వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది. కొత్తగా ఏర్పడిన 13తో కలిపి ఏపీలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. నూతన జిల్లాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం జగన్ అమరావతి నుంచి వర్చువల్‌గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆ క్షణం నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇవాళ మంచి పనికి శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇది అన్న ఆయన.. 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయని... ఆ 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకున్నామని గుర్తుచేశారు. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే మార్పులు చేశామని జగన్ అన్నారు.
కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగిందని... ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరమని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల పేర్లను సీఎం జగన్ స్వయంగా చదివి వినిపించారు. ప్రజల సెంటిమెంట్లు, ఆ జిల్లాల్లో ప్రఖ్యాతి గాంచిన వారి పేర్లను పరిగణనలోకి తీసుకున్నాకే ఇలా జిల్లాలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని గుర్తుచేసిన జగన్.. జనాభా ప్రతిపాదికన మన రాష్ట్రానికి జిల్లాల ఏర్పాటు అవసరం వుందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments