YS Jagan:అది నారా వారి ఘన చరిత్ర .. నారీ వ్యతిరేక చరిత్ర, ఇలాంటి వ్యక్తిని సీఎంని చేస్తారా : బాబుపై జగన్ విమర్శలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను మరోసారి టార్గెట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను జగన్ డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. కాగా.. నాలుగో విడత వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు జగన్.
డ్వాక్రా మహిళలను చంద్రబాబు రోడ్డు మీద నిలబెట్టారు :
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2014-19 మధ్యకాలంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళలను ఆయన నడిరోడ్డుపై నిలబెట్టారని.. చంద్రబాబు హయాంలో 14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని .. వాటిని తామే చెల్లించామని జగన్ వెల్లడించారు. మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదేనని.. అది వారి చరిత్ర... అది నారా వారి చరిత్ర.. అది నారీ వ్యతిరేక చరిత్ర అంటూ సీఎం విమర్శించారు. 2016లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని.. దీని కారణంగా ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ.. సీ , డీ గ్రేడ్‌కు దిగజారాయని ఆయన దుయ్యబట్టారు.
విపక్షాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి :
విపక్షాలకు మైండ్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయని.. ఇన్నిన్ని పథకాలు చంద్రబాబు హయాంలో చూశారా , ఆయన వున్నప్పుడు సామాజిక న్యాయం వుందా అని జగన్ ప్రశ్నించారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువును అడ్డుకున్నారని.. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా.. అలాంటి వ్యక్తిని ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అని సీఎం ప్రశ్నించారు.
ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఎందుకు కల్పించాలి :
చంద్రబాబు సీఎం అయితే మనకు మంచి జరగదని.. ఆయన తనకు గిట్టని వారి అంతు చూస్తారట అంటూ జగన్ సెటైర్లు వేశారు. దళితులను చీల్చారని, మైనార్టీలకు నరకం చూపించాడని, ఎస్టీలకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని, బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కావాల్సింది .. దోచుకోవడం, పంచుకోవడమేనని ఎద్దేవా చేశారు. పుంగనూరు ఘటనలో 47 మంది పొలీసులకు గాయాలయ్యాయని.. ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఎందుకు కల్పించాలని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు కారణంగా ఒక పోలీస్ కళ్లు పోయాయని.. చివరికి శవరాజకీయాలకు కూడా ఆయన వెనుకాడటం లేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments