YS Jagan:ఐఎంఎఫ్ కార్యాలయంలో ఏపీ విద్యార్ధుల బృందం , గీతా గోపీనాథ్‌తో భేటీ.. గర్వంగా వుందంటూ జగన్ ట్వీట్

  • IndiaGlitz, [Wednesday,September 27 2023]

అమెరికా పర్యటనలో వున్న ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల బృందం బిజిబిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించిన పిల్లలు, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. తాజాగా వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌ , ఐఎంఎఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. సుబ్రమణియన్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో విద్యార్ధులకు వారిద్దరూ కీలక సూచనలు చేశారు.

తమ జీవితాన్నే పాఠాలుగా చెప్పిన గీతా గోపీనాథ్, సుబ్రమణియన్ :

విద్యార్ధులకు సుబ్రమణియన్ తన వ్యక్తిగత విజయగాథనే ఉదాహరణగా చెప్పి స్పూర్తిని నింపారు. తన చదువే తనని ఐఎంఎఫ్‌లో ప్రముఖ వ్యక్తిగా నిలబెట్టిందని.. యువతకు నిజమైన ప్రేరణగా పనిచేసిందని సుబ్రమణియన్ చెప్పారు. అలాగే సాధారణ నేపథ్యం నుండి వచ్చిన గీతా గోపీనాథ్‌.. ఐఎంఎఫ్‌లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎదిగేవరకు చేసిన తన కృషిని ప్రయాణాన్ని విద్యార్ధులతో పంచుకున్నారు. దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అందుకోగలరనే నమ్మకాన్ని విద్యార్థుల్లో నింపేలా గీతా గోపినాథ్ ప్రసంగించారు. మీ కలలను అనుసరిస్తూ మీరు ఎన్నుకున్న మార్గంలో మందుకు సాగి ఎత్తైన శిఖరాలు చేరుకోవాలని గీతా గోపీనాథ్‌ ఆకాంక్షించారు.

మానవ వనరులపై ఏపీ పెట్టుబడులపై ఐఎంఎఫ్ ప్రశంసలు :

విద్యార్థులు ఆత్మస్థైర్యం , ధృడ సంకల్పంతో చదువుకుని ఉత్సాహంతో పని చేసి దేశ కీర్తి చాటి చెప్పాలని కె. సుబ్రమణియన్ అన్నారు. కె. సుబ్రమణియన్, గీతా గోపీనాథ్ వంటి నిష్ణాతులైన వ్యక్తులను కలవడం ద్వారా విద్యార్ధులకు ప్రేరణగా నిలుస్తాయని చెప్పటంలో అతీశయోక్తి లేదు. మానవ వనరులపై పెట్టుబడులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను ఐఎంఎఫ్ ప్రశంసించింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాలను అనుకరించాలని ఐఎంఎఫ్ సూచించింది.

గీతా గోపీనాథ్‌కు జగన్ థ్యాంక్స్ :

రాష్ట్రానికి చెందిన విద్యార్ధులను ఐఎంఎఫ్ కార్యాలయానికి ఆహ్వానించి , వారితో ముచ్చటించినందుకు గాను గీతా గోపీనాథ్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘పిల్లలను కలుసుకున్నందుకు, వారిని సాదరంగా ఆహ్వానించినందుకు థ్యాంక్స్. వారి చిరునవ్వులే ఆ విషయాన్ని చెబుతున్నాయి. చదువు అనేది వ్యక్తిగత జీవితాలనే కాక.. మొత్తం సమాజాన్ని మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నాను. మా పిల్లలే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పిల్లలను చూస్తే గర్వంగా వుంది’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.