YS Jagan:నా వాలంటీర్లనే అంటారా.. జగన్ ఎదురుదాడికి బిత్తరపోయిన ప్యాకేజ్ స్టార్లు, పెయిడ్ గ్యాంగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏదో సినిమాలో ‘‘నేను దిగనంత వరకే’’ అన్న డైలాగ్ ఫుల్ ఫేమస్. తన విశ్వరూపం చూపిస్తే ఎలా వుంటుందో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విపక్షాలకు రుచి చూపించారు. తన అనుకున్న వాళ్ల జోలికొస్తే ట్రీట్మెంట్ ఎలా వుంటుందో ఎల్లో మీడియాకు , దాని నీడలో పనిచేసే దత్తపుత్రుడికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. తాను మాటలు పడేది, మౌనంగా వుండేది చేతకాక కాదని.. ఒక ఛాన్స్ ఇద్దామనేనని, మారకుంటే రియాక్షన్ ఎలా వుంటుందో జగన్ తెలియజేశారు.
వాలంటీర్ల చుట్టూ ఏపీ రాజకీయాలు :
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేస్తూ.. ఆపదలో మేం వున్నామంటూ భరోసా కల్పించే లక్షలాది మంది వార్డు, గ్రామ వాలంటీర్లపై నిరాధారమైన ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం వైసీపీలోని కొందరు సంఘ విద్రోహ శక్తులకు చేరుతోందని.. దీని కారణంగానే రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమయ్యారంటూ పవన్ ఆరోపించారు. ఆ మరుసటి రోజు నుంచే వాలంటీర్లు , వైసీపీ నేతలు జనసేనానిపై భగ్గుమన్నారు. ప్రతి చోటా ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ.. నిరసన ప్రదర్శనలు చేశారు.
పవన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి జీవో :
ఇంత జరుగుతున్నా పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పు రాలేదు. వారాహి యాత్ర జరిగినంత దూరం, చివరికి ఢిల్లీలో ఎన్డీయే సమావేశం నుంచి తిరిగొచ్చాక కూడా వాలంటీర్లపై అదే తప్పుడు కూతలు కూశారు. పవన్‌లో మార్పు రాకపోవడం, వాలంటీర్ల నైతిక స్థైర్యం దెబ్బతినే పరిస్థితులు నెలకొనడంతో ఏపీ ప్రభుత్వం యాక్షన్‌లోకి దిగింది. పవన్ కల్యాణ్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు వీలుగా జీవో జారీ చేసింది. ఆ వెంటనే ఆయనపై పరువు నష్టం దావా వేసేందుకు కూడా రెడీ అవుతోంది. అయినా పవన్ దారికి రాలేదు. ట్విట్టర్ పిట్ట ద్వారా మళ్లీ అవే ప్రేలాపనలు .
వెంకటగిరి సభలో జగన్ విశ్వరూపం :
ఇక తాను రంగంలోకి దిగాల్సిందేనని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెడుగుడు ఆడుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం జగనన్న నేతన్న నేస్తం నిధుల విడుదల కార్యక్రమానికి హాజరైన ఆయన పవన్‌తో మొదలుపెట్టి.. బాలయ్య, చంద్రబాబు ఇతర పచ్చ బ్యాచ్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ ప్రాణాలు తెగించి సేవలు అందించిన వాలంటీర్లను ఒక్క మాటన్నా ఊరుకోనని ఆయన తేల్చిచెప్పారు. మంచి చేస్తున్న వారిని తిట్టడం సంస్కారం అనిపించుకోదని.. వాలంటీర్లకి తాను అండగా ఉంటానని జగన్ భరోసా కల్పించారు.
బాలయ్య, చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు ఇచ్చిపడేసిన సీఎం:
అమ్మాయిలు కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదంటే కడుపు చేయాలనే మహానుభావుడు ఒకరు (నందమూరి బాలకృష్ణ ).. మీరు సినిమాల్లో చేశారు నేను కాలేజీ రోజుల్లోనే చేసేశానని చెప్పే మాజీ సీఎం ఒకరు (చంద్రబాబు).. మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటూ అమ్మాయిలకి ద్రోహం చేసేవాడు ఒకరు (పవన్ కళ్యాణ్).. అమ్మాయిలతో కలిసి మందుతాగి స్విమ్మింగ్ ఫూల్లో అసభ్యంగా పోజులు ఇచ్చే వాడు ఒకరు (నారా లోకేష్).. ఇలాంటి వాళ్లా మా వాలంటీర్ల గురించి మాట్లాడేది? అంటూ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిపడేశారు.
వాలంటీర్లు మన పిల్లలేనన్న జగన్ :
రామోజీరావు స్క్రిప్ట్ ఇస్తుంటే.. నిర్మాతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వారిద్దరూ చెప్పినట్లు పవన్ కల్యాణ్ ఆడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. వాలంటీర్లు ఎక్కడి నుంచో దిగి రాలేదని, వాళ్లు మన గ్రామంలోని పిల్లలేనని, వారి గురించి ప్రజలకు తెలియదా అని జగన్ ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి ఈ స్థాయిలో తన మాటలతో దాడి చేయడం ఇదే తొలిసారి. విపక్షాల నుంచి విమర్శలు వచ్చినా సుతిమెత్తగా వ్యాఖ్యలు చేసి వదిలేసేవారు. చివరికి తన కుటుంబం గురించి ఎన్నో మాటలు అంటున్నా జగన్ చిరు నవ్వులు చిందించారే తప్పించి పల్లెత్తు మాట కూడా అనలేదు.
వాలంటీర్లపై ఈగ వాలనివ్వనన్న జగన్ :
కానీ తనకు దైవం లాంటి మేనిఫెస్టోలో తాను ఇచ్చిన హామీలను 98.9 శాతం అమలు చేయడంలో తనకు అన్ని విధాలా సహకరించిన వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో గౌరవం. అందుకే వారిని గౌరవించేందుకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాంటి వాలంటీర్లను చేయని తప్పుకు నానా మాటలు అనడం జగన్‌కు ఆగ్రహం తెప్పించింది. అందుకే తనవారి కోసం ఆయనే రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి నుంచి ఈ స్థాయిలో రియాక్షన్ వస్తుందని ఊహించని ప్యాకేజ్ స్టార్టు, పెయిడ్ గ్యాంగ్‌లు తేలుకుట్టిన దొంగల్లా కామ్ అయిపోయారు. ఏమంటే మళ్లీ అటు నుంచి ఎలాంటి దాడి జరుగుతుందోనని సైలెంట్ అయ్యారు. మీరు ఒకటి అంటే తాను నాలుగు అనగలనని జగన్ హెచ్చరికలు పంపినట్లయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout