జగన్ కీలక నిర్ణయం.. కరోనా మృతుడి అంత్యక్రియలకు రూ.15000
- IndiaGlitz, [Wednesday,July 15 2020]
ఏపీ సీఎం జగన్ కరోనా బాధితుల విషయమై మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్షను నిర్వహించారు. కోవిడ్ కేసు వస్తే ఏ ఆసుపత్రి కూడా నిరాకరించవద్దని.. రోగుల విషయంలో వివక్ష చూపే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ.15000 అందజేయాలని నిర్ణయించారు. దీనిపై వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
క్వారంటైన్ సెంటర్లలోని రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని జగన్ సూచించారు. అలాగే క్వారంటైన్ సెంటర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆయా కేంద్రాల వద్ద కాల్ సెంటర్ల నంబర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లలో మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కరోనా బాధితులను ఆసుపత్రులకు తీసుకు రావడంలో ఆలస్యమవుతోందని.. ఈ కారణంగా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని జగన్ అభిప్రాయపడ్డారు.