Ysrcp MP:రిజర్వేషన్ లేకుండానే 50 శాతం పదవులు.. మహిళా సాధికారతే జగన్ లక్ష్యం : లోక్‌సభలో వైసీపీ ఎంపీలు
Send us your feedback to audioarticles@vaarta.com
దశాబ్థాలుగా భారతీయ మహిళలు కన కల ఇన్నాళ్లకు నెరవేరింది.. అసాధ్యం అనుకున్న దానిని మోడీ షా ద్వయం సుసాధ్యం చేసి చూపించింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియమ్)కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. అయితే 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాదని, 2029లోనే దీనిని అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రకటించారు. 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత డీలిమిటేషన్ అనంతరం మహిళలకు రిజర్వేషన్ కోటా అమలుకానుంది. ఈ బిల్లుకు ఆమోదం లభించడం వల్ల లోక్‌సభలో మహిళల సీట్ల సంఖ్య 181కు పెరగనుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు 454 మంది అనుకూలం, ఇద్దరు వ్యతిరేకం :
సెప్టెంబర్ 19న ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 8 గంటల పాటు బిల్లుపై చర్చ జరగ్గా.. 60 మంది సభ్యులు దీనిపై మాట్లాడారు. బిల్లు అసంపూర్తిగా వుందని.. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా వుండాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీనికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కౌంటరిచ్చారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కులాల వారీగా కోటా అడగటం సరికాదన్నారు. అనంతరం స్పీకర్ సభలో ఓటింగ్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలమైతే ఆకుపచ్చ స్లిప్పుపై ‘‘ఎస్’’ అని, వ్యతిరేకమైతే ఎరుపు రంగు స్లిప్పుపై ‘‘నో’’ అని రాయాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్ వివరించారు. ఓటింగ్‌లో 456 మంది సభ్యులు పాల్గొనగా.. వీరిలో 454 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. వీరిలో ఒకరు హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఒవైసీ కాగా, మరొకరు ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్ధతు :
మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా మరోసారి తాను మహిళా పక్షపాతినని రుజువు చేసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్ధతు తెలిపింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణమాఫీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపునేస్తం వంటి పథకాలతో మహిళలు ఆర్ధిక స్వావలంభన సాధించేలా జగన్ చర్యలు చేపట్టారు. అలాగే నామినేటెడ్, స్థానిక సంస్థల పదవుల్లో 50 శాతం మహిళలకే కేటాయించి మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు జగన్ ప్రోత్సాహం కల్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా మద్ధతు తెలిపి.. చారిత్రక బిల్లు ఆమోదం పొందడంలో తన వంతు పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి.
ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి : ఎంపీ సత్యవతి
ఇక బిల్లుపై ఓటింగ్ సందర్భంగా మహిళా హక్కులు, మహిళా సంక్షేమం, మహిళా సాధికారత కోసం ఏపీలో జగన్ తీసుకుంటున్న చర్యలను వైసీపీ మహిళా ఎంపీలు లోక్‌సభలో ప్రస్తావించారు. అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి మాట్లాడుతూ.. మనదేశాన్ని సైతం భారత మాత అంటూ సంబోధిస్తాం. దేశానికీ, మహిళలకు అత్యున్నత గౌరవం ఇస్తున్నాం. ఇప్పుడు వారికి అన్ని రాష్ట్రాల చట్టసభలతో పాటు ఏకంగా లోక్‌సభలో సైతం 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా మహిళా గళం వినిపించేందుకు గొప్ప అవకాశం కల్పించినట్లు అవుతుందని సత్యవతి అన్నారు. ఈ రిజర్వేషన్ దేశరాజకీయ స్వరూపాన్నే సమూలంగా మారుస్తుందని సత్యవతి ఆకాంక్షించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం మహిళా పక్షపాతి అని వివరించారు. పదిహేనేళ్ల పాటు మహిళా రిజర్వేషన్ అమలు చేశాక అప్పుడు మళ్ళీ సమీక్ష జరిపి ఇంకా రిజర్వేషన్ కొనసాగించే అంశాన్ని పరిశీలించాలన్నది జగన్ మోహన్ రెడ్డి అభిమతం అన్నారు. ఓబీసీలకు సైతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని పరిశీలించాలన్నది తమ అధినేత ఆలోచన అని లోక్‌సభలో పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు జగన్ కంకణం కట్టుకున్నారు : ఎంపీ వంగా గీత
మరో ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. తమ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రిజర్వేషన్లు అనే పదం లేకుండానే నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల పదవుల్లో 50% పదవులు మహిళలకు ఇచ్చారని వంగా గీత గుర్తుచేశారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా , రాజకీయంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు కంకణం కట్టుకున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో 33 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి వారిలో ధైర్యం నింపారని వంగా గీత ప్రశంసించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెబుతూ ఓబీసీ రిజర్వేషన్ సైతం ఉండాలన్నది వైసీపీ విధానం అన్నారు. జనగణనలో కులగణన చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లు కూడా పూర్తి చేయాలని, ఈ బిల్లు అమలులో ఆలస్యం జరగకుండా వీలైనంత త్వరగా అమలు చేయాలని వంగా గీత కేంద్రాన్ని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout