AP CM Jagan:మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్

  • IndiaGlitz, [Thursday,January 04 2024]

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ను ఏపీ సీఎం వైయస్ జగన్‌(YS Jagan) పరామర్శించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్(KTR), తలసాని శ్రీనివాస యాదవ్ జగన్‌కు స్వాగతం పలికి ఇంటి లోపలికి తీసుకుని వెళ్లారు. అనంతరం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చిన జగన్.. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు.

కాగా గత నెల 8వ తేదిన తన ఫామ్‌హౌజ్‌లోని బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్‌ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. వెంటనే సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షించి తుంటి ఎముక విరిగిందని ఆపరేషన్ చేయాలని గుర్తించారు. అనంతరం హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ నిర్వహించారు. వారం పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కేసీఆర్.. డిసెంబర్ 15న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆసుపత్రిలో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), కాంగ్రెస్ మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu), పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాత్రం పరామర్శించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు ఇవాళ గులాబీ బాస్‌ను పరామర్శించారు.