CM Jagan:సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం.. మూడు రాజధానులపై తేల్చేసిన జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ .. మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని పెడతామని ప్రకటించింది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ సర్కార్ ముందుకే వెళ్లింది. చివరికి విషయం కోర్టులకు సైతం చేరింది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగన్ సర్కార్ విశాఖ నుంచే పరిపాలన సాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పలు వేదికలపై సీఎం జగన్ తన అభిమతాన్ని వ్యక్తపరిచారు. తాజాగా మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూలపేట వద్ద గ్రీన్ ఫీల్డ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన :
బుధవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద గ్రీన్ ఫీల్డ్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం నౌపడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే వుంటానని చెప్పారు. అక్కడే కాపురం పెట్టబోతున్నానని, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే అక్కడికి వస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. రెండేళ్లలో మూలపేట పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని.. దీని వల్ల 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పోర్ట్ ఆధారిత, అనుబంధ పరిశ్రమల వల్ల మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని జగన్ ఆకాంక్షించారు. దీనితో పాటు జిల్లాకు మరో రెండు ఫిషింగ్ హార్బర్లు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేస్తామని.. మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.
గంగపుత్రులను వలస పోనివ్వం :
గత ప్రభుత్వాలు మూలపేట పోర్టును పట్టించుకోలేదని.. రాష్ట్రంలో ఇప్పటిదాకా నాలుగు పోర్టులు మాత్రమే వుండగా వైసీపీ అధికారంలోకి వచ్చాక మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా వుండేందుకు కృషి చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోందన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి కాబట్టి.. మన పిల్లలకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని జగన్ ఆకాంక్షించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout