CM Jagan:ఏపీ సీఎం జగన్ ఆస్తులు రూ.779.8కోట్లు.. అప్పులు ఎంతంటే..?
- IndiaGlitz, [Tuesday,April 23 2024]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జగన్ తరపున సోమవారం ఆయన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన తన చరాస్తుల విలువను రూ.483.08 కోట్లు, స్థిరాస్తుల విలువను రూ.46 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే తన సతీమణి భారతి పేరిట రూ.రూ.119.38 కోట్లు విలువైన చరాస్తులు, రూ.56 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. కుమార్తెలు హర్షిణి రెడ్డి పేరిట రూ.24.26 కోట్లు, వర్షా రెడ్డి పేరిట రూ.23.94 కోట్ల చరాస్తులు ఉన్నట్లు చూపించారు.మొత్తంగా జగన్ కుటుంబానికి మొత్తం రూ.779.8కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. .
జగన్ ఆస్తుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బీమా, ఇతరులకు ఇచ్చిన అప్పులు, స్థిరాస్తులు ఉన్నాయి. ఇడుపులపాయలో రూ.35.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇడుపులపాయ, భాకరాపురం, బంజారాహిల్స్, సాగర్ సొసైటీలో ఆస్తులున్నాయి. భారతి సిమెంట్స్‌లో జగన్‌కు రూ.36 కోట్లు, కార్మియల్, ఏసియో హోల్డింగ్ ప్రైవేటు లిమిటెడ్‌లో రూ.8లక్షలు, క్లాసిక్‌రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్‌లో రూ.65.19 కోట్లు, సండూర్ పవర్‌లో రూ.130 కోట్లు, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో రూ.27.60 కోట్లు, సిలికాన్ బెండర్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో రూ.2.86 కోట్లు.. మొత్తం రూ.263.64 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. అప్పులు రూ.1.10 కోట్లు ఉన్నట్టు తెలిపారు.
ఆయన సతీమణి భారతి పేరిట రూ.5.29 కోట్ల విలువ చేసే 6.47 కిలోల బంగారు, వజ్రాలు ఉన్నాయి. ఎర్రగుడిపల్లె, కచివారిపల్లె, పులివెందుల, రాయదుర్గం, తాడేపల్లిలో ఆస్తులు ఉన్నాయి. అలాగే సండూర్ పవర్‌లో రూ.11.45 కోట్లు, సరస్వతిలో రూ.13.80 కోట్లు, హేల్‌వన్ టెక్నాలజీలో రూ.12.84 కోట్లు, క్లాసిక్ రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్‌లో రూ.4.55 కోట్లు, సిలికాన్‌లో రూ.2.99 లక్షలు, ఆకాశ్‌లో రూ.10.24 కోట్లు.. మొత్తం ఆమె పేరిట రూ.53.8 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. అప్పులు రూ.7.40 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు.
ఇక సీఎం జగన్‌పై 26 కేసులు ఉన్నట్లు వివరించారు. ఇందులో 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, సరూర్‌నగర్ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు. మరోవైపు ఈనెల 25వ తేదీన జగన్ స్వయంగా పులివెందుల వచ్చి రెండో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు.